సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

 లండన్:

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేపట్టిన లండన్ పర్యటన కొనసాగుతోంది. లండన్‌లోని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాల ప్రతినిధులతో ఆయన సమావేశమై రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, నూతన భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన, అక్కడ అమలవుతున్న విద్యా విధానాలు, పరిశోధనా పద్ధతులను పరిశీలించారు. అమెరికా పర్యటన రద్దు – అధికారుల బృందానికి ఆదేశాలులండన్ పర్యటన అనంతరం చేపట్టాల్సిన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ఉన్నత విద్యాసంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల కోసం ఉద్దేశించిన కార్యక్రమానికి అనుమతి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమెరికాలో వివిధ సంస్థలతో ఖరారైన ఒప్పందాలు (MoUలు) యథాతథంగా కొనసాగాలని ఆయన ఉన్నతాధికారుల బృందాన్ని ఆదేశించారు. లండన్ పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యా, మౌలిక వసతుల రంగాలపై నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షల్లో పాల్గొంటారు.

Comments